మూసీ పునరుజ్జీవ పథకంలో ముందడుగు.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను అద్బుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

By అంజి
Published on : 9 Sept 2025 6:55 AM IST

Musi River Development scheme, CM Revanth, Godavari drinking water scheme, Hyderabad

మూసీ పునరుజ్జీవ పథకంలో ముందడుగు.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన 

రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను అద్బుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. గోదావరి తాగునీటి సరఫరా పథకం (ఫేజ్ II & III), ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పునరుజ్జీవం పథకానికి గండిపేట వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

దాదాపు 7,360 కోట్ల వ్యయంతో రెండేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నది నుంచి 20 టీఎంసీ నీటిని తరలించడం ప్రధానం కాగా, అందులో జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 17.50 టీఎంసీల నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను నింపడం, మరో 2.50 టీఎంసీల జలాలను మూసీ నది పునరుజ్జీవనానికి కేటాయించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “గోదావరి జలాలను తరలించే ఈ గొప్ప కార్యక్రమం ద్వారా జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా మూసీ కాలుష్యాన్ని నివారించి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తాం. నగరానికి ప్రతి ఏటా 3 శాతం ప్రజలు వలసలు పెరుగుతున్నాయి. నగరం కోటిన్నర జనాభాకు పెరుగుతున్న తరుణంలో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తు ప్రణాళికలు అవసరం. పెరుగుతున్న నగర అవసరాల మేరకు కృష్ణా జలాలు కూడా సరిపోవని అనుకున్నప్పుడు గోదావరి జలాలను తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదేళ్లలో కృష్ణా, గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరాబాద్ నగరానికి తరలించలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ గోదావరి నీటిని తరలించి కేవలం హైదరాబాద్ ప్రజలకు తాగునీరే కాకుండా కాలుష్యం నుంచి మూసీ నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టాం.

మురికికూపంగా మారి విషం చిమ్ముతున్న మూసీ జలాల వల్ల ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో నీరు తాగితే పశువులే కాదు, మనుషులు ప్రాణాలు పోతున్నాయి. పుట్టబోయే బిడ్డలు సైతం అంగవైకల్యంతో పుడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో సబర్మతీ, ఉత్తర ప్రదేశ్‌లో గంగా, ఢిల్లీలో యమునా నదుల ప్రక్షాళన చేసుకున్నప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగొద్దు.

ఆ జిల్లా ప్రజలతో కలిసి నడిచినప్పుడు ఎలాగైనా సరే మూసీని పునరుజ్జీవింపజేయాలని ప్రజలు కోరినప్పుడు ఆరోజు మాటిచ్చా. మూసీని ప్రక్షాళన చేస్తాం. హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ ఫ్యాక్టరీల కాలుష్యం మూసీలో కలవకుండా నియంత్రిస్తాం. హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలన్న ప్రాజెక్టుకు మూలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నాం. గోదావరిపై 2008 లో తుమ్మడిహెట్టి వద్ద దివంగత వైఎస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతిని ప్రారంభించారు.

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో త్వరలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతాం. తుమ్మడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు చేపట్టాలని ప్రతిపాదిస్తే, మహారాష్ట్ర ప్రభుత్వం 142 మీటర్ల ఎత్తు వరకు అభ్యంతరం చెప్పడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మధ్యంతరంగా148, 150 మీటర్ల వరకైనా ఒప్పించి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షన్నర, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.

గతంలో సంకల్పించినట్టుగా ప్రాజెక్టును పూర్తి చేసి చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి వరకు వ్యవసాయానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటాం. ఈ ప్రాజెక్టు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్‌గా అభివృద్ధి చేస్తాం. గేవ్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం తలపెట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసిరండి..” అని పిలుపునిచ్చారు.

Next Story