హైదరాబాద్‌లో స్కార్లెట్ ఫీవర్ ప్రబలడానికి వాతావరణమే కారణమా?
హైదరాబాద్ నగరంలోని ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా గవదబిళ్ళలు, స్కార్లెట్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 March 2024 7:00 AM GMTహైదరాబాద్‌లో స్కార్లెట్ ఫీవర్ ప్రబలడానికి వాతావరణమే కారణమా?
విపరీతమైన పొడి వాతావరణం, కాలుష్యంతో పాటు ఇతర కారణాలతో హైదరాబాద్ నగరంలోని ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా గవదబిళ్ళలు, స్కార్లెట్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. స్కార్లెట్ ఫీవర్, గవదబిళ్ళలు నగరంలో ప్రతీ ఏడాది వచ్చే అంటువ్యాధులలో ఒకటి. ఈ రెండు వ్యాధులు పెద్దల కంటే పిల్లలు, యువకులను ప్రభావితం చేస్తాయి.
పెరుగుతున్న కాలుష్యం:
డెంగ్యూ, మలేరియా వంటి అంటు వ్యాధులు తగ్గినప్పటికీ, హైదరాబాద్‌లో దాదాపు మూడు నెలలుగా పొడి వాతావరణం, వర్షాలు లేకపోవడం వల్ల గాలిలో దుమ్ము, కాలుష్యం పెరిగింది, దానితో పాటు కొన్ని అనారోగ్యాలు కూడా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో గవదబిళ్లలు చాలా ప్రాంతాల్లో ప్రబలినప్పటికీ.. ఫిబ్రవరి మార్చిలో, స్కార్లెట్ ఫీవర్ కేసులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి, ప్రధానంగా 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల వారిలో ఎక్కువగా కనిపించాయి. పరీక్షల సీజన్ కావడంతో తల్లిదండ్రులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ జ్వరం కేసులే కాకుండా, పొడి కళ్ళు, డస్ట్ అలెర్జీ కేసులు కూడా తరచుగా ప్రజలలో కనిపిస్తాయి.
స్కార్లెట్ ఫీవర్: లక్షణాలు-తీవ్రత
అంటువ్యాధి, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా అయిన స్కార్లెట్ ఫీవర్‌ను సొంత వైద్యంతో పరిష్కరించుకోకూడదు.. లేదా నిర్లక్ష్యం చేయకూడదని గుర్తుంచుకోవడం ముఖ్యం. వైద్యులతో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాల సమస్యలు, గుండె జబ్బులు వస్తాయి.. ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సాకేతారెడ్డి అన్నారు.
స్కార్లెట్ ఫీవర్ లక్షణాల గురించి ఆమె మాట్లాడుతూ.. స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల గొంతు నొప్పి కలుగుతుంది. అధిక జ్వరం, దగ్గు, ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. దద్దుర్లు చిన్నవిగా ఉంటాయి. కొన్నిసార్లు కళ్ళు ఎర్రబడటం, నాలుకపై చిన్న ఎర్రటి మచ్చలు కనిపించడం లక్షణాల్లో భాగం. దీనిని ‘స్ట్రాబెర్రీ నాలుక’ అంటారు.
యాంటీబయాటిక్స్‌తో సత్వర చికిత్స:
స్కార్లెట్ ఫీవర్ ను నివారించగల వ్యాక్సిన్‌లు లేవు. పలు లక్షణాలు కొనసాగితే.. గొంతు ఇన్ఫెక్షన్‌కు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అవసరం, జ్వరాన్ని తగ్గించడానికి పారాసెటమాల్‌లు అవసరం. రోగులకు పోషకమైన ఆహారం, ద్రవాలు చాలా ఇవ్వాలి. రోగులకు కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున చికిత్స ఆలస్యం అవ్వకూడదు. సరైన చికిత్సతో, లక్షణాలు తగ్గుతాయి. రోగులు ఒకటి లేదా రెండు వారాల్లో కోలుకుంటారు.
స్కార్లెట్ ఫీవర్ పెద్ద వయసు వారిని చాలా అరుదుగా ప్రభావితం చేసినప్పటికీ.. ఇది అంటువ్యాధి కావడంతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి. ఇన్ఫెక్షన్ రాకుండా చేతుల పరిశుభ్రతను పాటించాలి. పిల్లవాడికి పూర్తిగా నయమయ్యే వరకు, వారిని పాఠశాలకు పంపకండి. రోగి వాడే వస్తువులను ఇతరులు వాడకుండా ఉండడమే మంచిది.
పొడి వాతావరణంలో చేయవలసినవి, చేయకూడనివి:
* సురక్షితంగా ఉండటానికి, పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు.
* ఏదైనా ఇండోర్ లేదా అవుట్‌డోర్ క్లీనింగ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు సర్జికల్ మాస్క్ ధరించండి, శుభ్రం చేసిన తర్వాత చేతులు కడుక్కోండి.
* బయట పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత లేదా ట్రాఫిక్‌లో ప్రయాణించిన తర్వాత గోరువెచ్చని ఉప్పు నీటిలో పుక్కిలించండి.
* బయట ఆహారాన్ని నివారించండి, ముఖ్యంగా రోడ్‌సైడ్ స్టాల్స్ లో ఫుడ్ తినకండి.
* గొడుగులు వాడండి.. టోపీలను ఉపయోగించండి.. ఎండకు వెళ్లే సమయంలో సన్‌స్క్రీన్ రాయండి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ఫుల్ స్లీవ్ కాటన్ దుస్తులను ధరించండి.
* నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు మొదలైన ఇతర ద్రవాలను తాగడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండండి.
* వేడి నుండి ఇంటిలోకి తిరిగి వచ్చిన తర్వాత, వెంటనే చల్లటి నీటిని తీసుకోకండి. నేరుగా ఎయిర్ కండిషన్డ్ గదిలోకి వెళ్లవద్దు.