సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి, ఆపై ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతిచెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్పూర్ పరిధిలో నివాసముంటున్న రజిత మహిళ తన భర్త, ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ (12), మధు ప్రియా (10), గౌతమ్ (8) లతో కలిసి నివాసం ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై తన పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుందని సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆ తల్లి తన ముగ్గురు పిల్లలకు అన్నంలో విషం కలిపి పిల్లలకు తిని పించి... అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించింది. డ్యూటీ నుంచి ఉదయం భర్త వచ్చేసరికి పిల్లలు మృతిచెంద గా.. భార్య అపస్మారక స్థితిలో పడి ఉంది. చావు బతుకుల మధ్య ఉన్న భార్యను చూసిన భర్త వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. పిల్లల్ని చంపడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తల్లి రజిత బీరంగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ ఘటన జరిగిందా? లేక దంపతుల మధ్య గొడవ కారణంగా జరిగిందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.