హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షంతో పాటు ఈదురుగాలులు భారీగా వీస్తుండడంతో పలు చోట్ల వృక్షాలు నేలకూలడంతో పాటు విద్యుత్ వైర్లు తెగిపడుతున్నాయి. అలా తెగిపడిన ఓ విద్యుత్ వైరును గమనించని ఓ వ్యక్తి పార్క్‌లో వార్నింగ్ వాక్ చేస్తూ దానిపై కాలు వేయడంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో చోటు చేసుకుంది.
పార్శిగుట్టలో నివాసం ఉండే ప్రవీణ్ ముదిరాజ్ (40) అనే వ్యక్తికి ప్రతి రోజు ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లే అలవాటు ఉంది. అలాగే ఈరోజు(శుక్రవారం) ఉదయం కూడా సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో శుక్రవారం ఉదయం నడకకు వెళ్లాడు. నగరంలో కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఓ విద్యుత్ వైర్ తెగి నేలపై పడింది.
దానిని గమనించని ప్రవీణ్.. దానిపై అడుగువేయడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. మార్నింగ్ వాక్ కోసం అక్కడకు వచ్చిన పలువురు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.