మోహన్‌బాబుపై కేసు నమోదు.. గన్‌ల డిపాజిట్‌కు పోలీసు శాఖ నోటీసు

మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన మీడియాపై దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు నటుడు మోహన్‌బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు.

By అంజి  Published on  11 Dec 2024 7:56 AM IST
Mohan Babu, licensed weapon, police, Hyderabad

మోహన్‌బాబుపై కేసు నమోదు.. గన్‌ల డిపాజిట్‌కు పోలీసు శాఖ నోటీసు

హైదరాబాద్‌: మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన మీడియాపై దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు నటుడు మోహన్‌బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. మోహన్ బాబు మీద పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై 118 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. బౌన్సర్లతో పాటు మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయితే నిన్న తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారు.

నిన్న రాత్రి జల్‌పల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్‌ బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి చేతుల్లోని మైకులను లాక్కొని ఆవేశంతో నేలకేసి కొట్టారు. గేటు లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులను బౌన్సర్లు బయటకు పంపించారు.

Next Story