ఐస్ బాత్.. ఇకపై హైదరాబాద్‌లో కూడా
ఐస్ బాత్.. ఎంతో మంది సెలెబ్రిటీలు గడ్డ కట్టే ఐస్ ముక్కల మధ్య కొద్దిసేపు సేదతీరుతూ ఉండే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Jun 2023 4:44 AM GMTఐస్ బాత్.. ఇకపై హైదరాబాద్‌లో కూడా
ఐస్ బాత్.. ఎంతో మంది సెలెబ్రిటీలు గడ్డ కట్టే ఐస్ ముక్కల మధ్య కొద్దిసేపు సేదతీరుతూ ఉండే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం మనం చూసే ఉంటాం. హైదరాబాద్ లో కూడా అలాంటి సదుపాయాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా చేయడం వలన అత్యంత శీతల ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యం మనలో పెంపొందించుకోవచ్చు. నిర్దిష్ట శ్వాస పద్ధతులతో మనం ఐస్ బాత్ చేస్తూ ఎంతసేపు ఉండగలం అనే విషయాలను తెలుసుకోగలం. ఇలాంటివి విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే హైదరాబాద్ లో కూడా త్వరలో అందుబాటులోకి వచ్చేస్తోంది.
హైదరాబాద్ నగరానికి చెందిన ఫిట్‌నెస్ ఎక్స్పెర్ట్ అయిన షేక్ అజ్గర్ సుల్తాన్ మొబైల్ ఐస్ బాత్ ట్రైనింగ్ సదుపాయాన్ని తీసుకుని రాబోతున్నారు. ప్రత్యేకమైన, అతిశీతలమైన ఫీచర్ ను నగరవాసులకు పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది పనిచేసే విధానం సులభం. మనిషి పట్టే అంత టబ్‌లో, ఐస్ క్యూబ్ లను కుప్పలు కుప్పలుగా పోస్తారు. నిపుణుల మార్గదర్శకత్వంలో ఆ వ్యక్తి ఆ టబ్‌లో కూర్చుని ఎంత సమయం ఉండగలడో.. అంత సమయం గడపవచ్చు. ఇలా చేయడం వలన మనిషి శరీరానికి ఎక్కడ లేని రిలీఫ్ వస్తుంది. నరాలు కూడా ఉత్తేజమవుతాయని అంటూ ఉంటారు.
ముయే థాయ్, మార్షల్ ఆర్ట్స్, కిక్‌బాక్సింగ్‌లో మాస్టర్ అయిన అజ్గర్ సుల్తాన్ ఫిట్‌నెస్ పట్ల మక్కువ చూపేవారు. అతను IT ప్రొఫెషనల్‌గా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి.. ఫిట్ నెస్ రంగంలో దిగాడు. “నేను దుబాయ్‌లోని ఫైట్ క్లబ్‌లో భాగం. అనేక ఇతర ఫిట్‌నెస్ స్టైల్స్ ను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే మన దగ్గర రికవరీకి మంచి పద్ధతులు లేవని నేను త్వరలోనే అర్థం చేసుకున్నాను. అప్పుడే నేను విమ్ హాఫ్ పద్ధతిని కనుగొన్నాను, ”అని అతను చెప్పాడు. అజ్గర్ తన ఫౌండేషన్, అడ్వాన్స్‌డ్ లెవల్ కోర్సులు రెండింటినీ పూర్తి చేయడానికి రెండుసార్లు థాయ్‌లాండ్ కు వెళ్ళివచ్చాడు. ఈ రోజు అతడు సర్టిఫైడ్ విమ్ హాఫ్ ట్రైనర్. అతను ప్రధానంగా ఆటిస్టిక్ పిల్లలు, సీనియర్ సిటిజన్లతో పని చేస్తాడు. "ఈ రికవరీ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నేను వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను. ఒక సెషన్ తర్వాత తాజాగా, పునరుజ్జీవనం పొంది బయటకు వస్తారు. ఇది నిద్ర లేమి, డిప్రెషన్ వంటి వాటిపై కూడా ప్రభావాన్ని చూపుతుంది ” అని చెప్పుకొచ్చాడు. తన మొబైల్ ఐస్ బాత్ సదుపాయం ఒక నెలలోపు అందుబాటులోకి రానుందని చెప్పాడు. వీలైనంత ఎక్కువ మందిని చేరుకోవడం, కోలుకునే అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. హైదరాబాద్ వాసులు అతడిని ఎంకరేజ్ చేస్తారని ఆశిద్దాం.