అగ్నిపథ్ ఆందోళన ఎఫెక్ట్.. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు రద్దు
MMTS and Metro Trains cancelled in Hyderabad with Agnipath Agitation.అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2022 9:52 AM GMTఅగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. మూడు నుంచి ఐదు రైళ్లకు నిప్పంటించారు. ఈ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. సికింద్రాబాద్ పరిధిలో దాదాపు 71 రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించింది. కాచీగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లను మూసివేశారు.
హైదరాబాద్-శాలీమార్, ఉందానగర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్, సికింద్రాబాద్-రేపల్లే, షిరిడీసాయి నగర్-కాకినాడ పోర్టు, భువనేశ్వర్-ముంబై రైళ్లను అధికారులు రద్దు చేశారు. భువనేశ్వర్-ముంబై సీఎస్‌టీ రైలును దారి మల్లించారు. భువనగిరి జిల్లాలోని నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌తోపాటు, పలు గూడ్స్ రైళ్లను నిలిపివేశారు. హావ్‌డా-సికింద్రాబాద్ రైలు, సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైళ్లను మౌలాలిలో, గుంటూరు-వికారాబాద్ రైలును చర్లపల్లిలో నిలిపివేశారు. మరికొన్ని సర్వీసులను దారిమళ్లించారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక రోడ్డు మార్గన తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..
సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. మొత్తం 44 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు.
ఏ రూట్‌లో ఎన్నంటే..
లింగంపల్లి-హైదరాబాద్- 8 సర్వీసులు
హైదరాబాద్-లింగంపల్లి- 9 సర్వీసులు
ఫలక్‌నుమా-లింగంపల్లి- 12 సర్వీసులు
లింగంపల్లి-ఫలక్‌నుమా- 13 సర్వీసులు
ఫలక్‌నుమా-హైదరాబాద్- 1
రామచంద్రాపురం-ఫలక్‌నుమా- 1 సర్వీసు చొప్పున ఉన్నాయి
మెట్రో బంద్..
ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు రావొద్దని అధికారులు సూచించారు. నగరంలోని అన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి యధావిధిగా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ క్రమంలో మియాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణీకులను ఎర్రగడ్డ స్టేషన్ వద్ద మెట్రో అధికారులు దించేశారు. ఆకస్మాత్తుగా రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనుల మీద వెలుతున్న తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.