హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. ఏవీ రంగనాథ్‌కు హైడ్రా కమిషనర్ ఇష్టం లేనట్టుందని, అందుకే తనపై కేసు పెట్టారని ధ్వజమెత్తారు. అధికారులు వస్తారు.. పోతారని, తాను మాత్రం లోకల్ అంటూ ఆగ్రహించారు. తాను ఎన్నో పోరాటాలు చేశానన్నారు. తనపై 190 కేసులు పెట్టారని, ఎవరికీ భయపడేవాళ్లం కాదని అన్నారు. గుడిసెల్లో వేలు పెట్టొద్దని, కబ్జా చేస్తేనే తీసేయ్యాలి అని అన్నారు. దీనిపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. సీఎం రేవంత్‌కు కూడా ఫిర్యాదు చేస్తానంటూ దానం నాగేందర్ పేర్కొన్నారు.
కాగా ప్రభుత్వ స్థలం వ్యవహారంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.69 నందగిరిహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ స్థల ప్రహరీని కొందరు కూల్చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. కూల్చివేతతో ఎమ్మెల్యేకు సంబంధం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూల్చివేత వల్ల రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.