బాలిక అదృశ్యం విషాదాంతం.. చెరువులో మృతదేహం లభ్యం
Missing Girl child dead body found in Dammaiguda Cheruvu.జవహర్‌నగర్‌లో అదృశ్యమైన పదేళ్ల చిన్నారి ఘటన
By తోట వంశీ కుమార్ Published on 16 Dec 2022 12:43 PM ISTమేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో అదృశ్యమైన పదేళ్ల చిన్నారి ఘటన విషాదాంతమైంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. దమ్మాయిగూడలోని అంబేడ్కర్ చెరువలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎవరైనా కిడ్నాప్ చేసి హత్య చేశారా..? లేదా ప్రమాద వశాత్తు బాలిక చెరువులో పడి మరణించిందా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కి చెందిన ఇందు దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. రోజులాగానే తండ్రి గురువారం ఉదయం బాలికను పాఠశాల వద్ద దించి వెళ్లాడు. బాలిక తన బ్యాగును స్కూల్‌లోనే విడిచిపెట్టి పార్క్‌కు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్‌మాస్టర్ తెలిపారు. ఈ విషయాన్ని బాలిక తండ్రికి తెలియజేశారు. ఎంత వెతికినప్పటికీ బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ పాఠశాల పరిసరాలు, మిగతా చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను జవహర్‌నగర్ పోలీసులు పరిశీలించారు. ఓ కెమెరాలో బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెలుతుండడం కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం బయటపడింది. బాలిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.