నిలిచిన మీర్ ఆలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జి ప్లాన్
Mir Alam Tank’s cable bridge plan comes to standstill. హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ 2021 డిసెంబర్‌లో
By అంజి Published on 29 Jan 2023 4:56 AM GMTహైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ 2021 డిసెంబర్‌లో పాత నగరంలోని మీర్ ఆలం ట్యాంక్ వద్ద.. నగరంలోని రెండవ కేబుల్ వంతెనను నిర్మించే ప్రణాళికను ప్రకటించింది. దీనికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అనేక ప్రకటనలు చేసింది. హైదరాబాద్ నగరంలో రెండో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే పర్యాటక కార్యకలాపాలతో పాటు ట్రాఫిక్ కూడా సులభతరం అవుతుంది. రూ.220 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ అప్పట్లో ప్రకటించింది.
అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు. ఈ పనులకు బడ్జెట్ విడుదల చేస్తే తప్ప అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టేలా లేరని తెలుస్తోంది. మీర్‌ఆలం ట్యాంక్ వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి హెచ్‌ఎండీఏ సవివరమైన నివేదికను కోరగా.. నిపుణులు దానిని అందజేసి ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతామని అధికార యంత్రాంగం ప్రకటించి పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగలేదు.
మీర్ ఆలం ట్యాంక్ వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో పర్యాటక కార్యకలాపాలు పెరగడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు చాలా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 2.5 కి.మీ కేబుల్ బ్రిడ్జి పాదచారులకు కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఆరు లేన్లతో ఉండే ఈ కేబుల్ బ్రిడ్జి సెంట్రల్ స్పాన్ 350 మీటర్లు, పైలాన్లు 100 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. డిమార్ట్-గురుద్వారా-కిషన్‌బాగ్-బహదూర్‌పురా క్రాస్‌రోడ్స్ మార్గంలో ప్రతిపాదించబడిన వంతెనతో ఈ వంతెన బెంగళూరు జాతీయ రహదారిని అత్తాపూర్ సమీపంలోని చింతల్‌మెట్‌తో కలుపుతుంది.