అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై సమీక్ష.. ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి
Ministers high level review meeting on fire prevention measures.హైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన నగరాల్లో ఎత్తైన
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2023 9:32 AM GMTహైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాలకు పైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్ లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జీహెచ్ ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బిఆర్ కె ఆర్ భవన్ లోని సిఎస్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
నిబంధనలు ఉల్లంగిస్తున్న భవనాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్టుమెంట్లలో సేఫ్టీ ఆడిట్‌ను నిర్వహించాలని, అయితే.. ఫైర్ సేఫ్టీ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. డెక్కన్ స్పోర్ట్స్ మాల్‌లో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మూడు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
ఫైర్ సేఫ్టీ విషయంలో డ్రోన్లు, రొబొటిక్ సాంకేతికను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. విదేశాలలో పాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న ఆదర్శవంతమైన పద్దతులపైన అధ్యయనాన్ని వేగంగా చేపట్టి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం శాఖకు అవసరమైన అత్యవసర సామాగ్రి విషయానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఉప మేయర్ , సి.ఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఇంధన, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ కమీషనర్ డీ.ఎస్. చౌహాన్, హైదరాబాడ్ కలెక్టర్ అమయ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.