సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి బోనాలు ఈ ఉద‌యం ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి వ‌చ్చిన మంత్రి.. అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించి పూజ‌లు చేశారు. బోనం సమర్పించిన అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రజలను చల్లగా చూడాలని, కరోనా బారి నుంచి బయటపడేలా అనుగ్రహించాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు.

కరోనా ఆంక్షలు ఉన్నా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో మాస్కులు అందజేస్తున్నారు. ఇక బోనాల నేప‌థ్యంలో నేడు, రేపు ఆలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story