తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్‌ను ప్రజలు చావుదెబ్బ కొట్టారు..అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నూటికి నూరు శాతం కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు విజ్ఞతతో ఉన్నారు. బీఆర్ఎస్ సభలో సోదరి సునీత పట్ల జాలిపడుతున్నాను. కానీ రాజకీయ వేదికల మీద సెంటిమెంట్లతో ఓట్లు రావు. రాజకీయ వేదికల మీద కన్నీళ్లు పెట్టుకుని ఓట్లు పొందాలని కేటీఆర్, హరీశ్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు...అని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు అసహనంతో ఇష్ట వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావు డ్రామాలు ఆపాలి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు. ఓట్లు అడగడం, ప్రచారంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ..కృతిమంగా ఏడవాలని ఆమెపై ఒత్తిడి చేయడం మంచిది కాదు..అని పొన్నం వ్యాఖ్యానించారు.