ఎనిమిదేళ్లలో ఐటీలో అద్భుతమైన పురోగతి.. గ‌తేడాది ఒక్క హైద‌రాబాద్‌లోనే ల‌క్ష‌న్న‌ర ఉద్యోగాలు

Minister KTR releases IT Annual report 2021-22.గ‌త ఎనిమిదేళ్ల‌లో ఐటీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌లో వేగంగా అభివృద్ది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2022 1:10 PM IST
ఎనిమిదేళ్లలో ఐటీలో అద్భుతమైన పురోగతి.. గ‌తేడాది ఒక్క హైద‌రాబాద్‌లోనే ల‌క్ష‌న్న‌ర ఉద్యోగాలు

గ‌త ఎనిమిదేళ్ల‌లో ఐటీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌లో వేగంగా అభివృద్ది సాధించింద‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్‌) అన్నారు. హైటెక్ సిటీలోని టెక్ మ‌హీంద్రా కార్యాల‌యంలో 2021-22 సంవ‌త్స‌రానికి ఐటీ వార్షిక నివేదిక విడుద‌ల కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది ఐటీ రంగంలో అంచ‌నాల‌కు మించి రాణించామ‌న్నారు.ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య పెరిగింద‌ని చెప్పారు. గ‌తేడాది దేశ వ్యాప్తంగా 4.5ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌స్తే ఒక్క హైద‌రాబాద్‌లోనే ల‌క్ష‌న్న‌ర వ‌చ్చాయ‌ని మంత్రి తెలిపారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉంద‌న్నారు. గ‌త‌ ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి ఐటీ ఎగుమ‌తులు కూడా పెరిగాయ‌న్నారు. 2021-22 ఏడాదిలో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్ల‌ని, 2035 నాటికి ఈ సంఖ్య‌ను రూ.2.9ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. ఈ నెల 20న టీ హబ్‌ రెండో దశ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.


Next Story