తీర‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు.. షేక్‌పేట ఫ్లైఓవ‌ర్ ప్రారంభం

Minister KTR inaugurates Shaikpet flyover.హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు మరింత తీరనున్నాయి. షేక్‌పేట ఫ్లై ఓవ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jan 2022 2:23 PM IST
తీర‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు.. షేక్‌పేట ఫ్లైఓవ‌ర్ ప్రారంభం

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు మరింత తీరనున్నాయి. షేక్‌పేట ఫ్లై ఓవ‌ర్ ను కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌రం వేగంగా అభివృద్ది చెందుతుంద‌ని, రీజిన‌ల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) పూర్తి అయితే హైద‌రాబాద్‌తో ఏ న‌గ‌రం పోటీ ప‌డ‌లేద‌న్నారు. న‌గ‌రంలో ట్రాఫిక్ క‌ష్టాలు లేకుండా గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తిని సాధించిన‌ట్లు చెప్పారు. కంటోన్మెంట్‌లో మూసివేసిన ర‌హ‌దారుల‌ను తెరిపించాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని మంత్రి కేటీఆర్ కోరారు.

చార్మినార్‌, గోల్కొండ స‌హా ఎన్నో చారిత్ర‌క క‌ట్ట‌డాలు ఉన్నాయ‌ని, హెరిటేజ్ సిటీగా హైద‌రాబాద్‌ను గుర్తించేలా కృషి చేయాల‌న్నారు. స్కైవేల నిర్మాణానికి స‌హాక‌రించాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు చెప్పారు. ప్యాట్నీ నుంచి కొంప‌ల్లి వ‌ర‌కు స్కైవేలు నిర్మించేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని.. అయితే కేంద్ర ర‌క్ష‌ణశాఖను భూములు ఇవ్వాల‌ని కోరినా స్పందించ‌డం లేద‌న్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలోని పొడ‌వైన ఫ్లైఓవ‌ర్ల‌లో షేక్‌పేట ఫ్లైఓవ‌ర్ ఒక‌టి. టోలిచౌకి నుంచి ఖాజాగూడ కూడ‌లి వ‌ర‌కు షేక్‌పేట నాలా రోడ్డుపై నిర్మించారు. దాదాపు మూడు కిలోమీటర్ల(2.8కి.మీ) పొడవున్న ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణాన్ని రూ.333.55 కోట్ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్టారు. ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రావ‌డంతో మెహదీపట్నం - హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

Next Story