హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతూ ఉన్నాయి.

By News Meter Telugu  Published on  19 July 2023 12:30 PM GMT
Minister KTR, Hyderabad, Heavy Rains,

హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు 

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని.. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నానక్‌రామ్‌గూడలోని కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసు వంటి విభాగాలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం ఉండకూడదని ఆదేశించారు.

జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను కూడా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు కేటీఆర్ కు తెలిపారు. జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డి వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు అధికారులు కేటీఆర్‌కు వివరించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వలన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఏడాది ఇబ్బందులు తప్పుతాయని భావిస్తూ ఉన్నారు.


Next Story