MeTimeOnMyMetro: మీలోని క్రియేటివిటీని ప్రదర్శించేందుకు అద్భుత అవకాశం
రోజూ లక్షలాది మంది ప్రయాణికులు వినియోగించే మెట్రో రైలు ఇప్పుడు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
By అంజి Published on 9 Jan 2025 8:29 AM ISTMeTimeOnMyMetro: మీలోని క్రియేటివిటీని ప్రదర్శించేందుకు అద్భుత అవకాశం
హైదరాబాద్: రోజూ లక్షలాది మంది ప్రయాణికులు వినియోగించే మెట్రో రైలు ఇప్పుడు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి, కళ, సాహిత్యం, సాంస్కృతిక రంగాలలో తమ అభిరుచులను ప్రదర్శించడానికి మెట్రోపై ఆధారపడిన అనేక మందికి మెట్రో అవకాశం కల్పిస్తోంది. ప్రయాణికులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఎంజీబీఎస్ వంటి విశాలమైన స్టేషన్లలో అనువైన స్థలాన్ని కేటాయిస్తామని హెచ్‌ఎంఆర్‌ఎల్, హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో, హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీలు 'మీ టైమ్ ఆన్ మై మెట్రో' పేరుతో మూడు రోజుల పాటు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ మెట్రో ఫెస్టివల్‌ను బుధవారం జేబీఎస్ మెట్రో స్టేషన్‌లో హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఎండీ అండ్ సీఈవో కేవీబీ రెడ్డి ప్రారంభించారు. మెట్రో అనేది కేవలం కాంక్రీట్, గోడలతో కూడిన రవాణా వ్యవస్థ కాదని, ఇది నగరానికి ఆత్మ అని, ఇది నగర సామాజిక-సాంస్కృతిక భావాలను ప్రతిబింబిస్తుందని ఎన్‌విఎస్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎన్వీఎస్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని కీలకమైన స్టేషన్ జంక్షన్లు, విశాలమైన ప్రాంతాలను ప్రత్యేక హబ్‌లుగా, అంతర్జాతీయ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు ఫేజ్-2 పార్ట్-బిలో ప్రతిపాదిత జెబిఎస్ - శామీర్‌పేట (22 కిమీ), ప్యారడైజ్ - మేడ్చల్ (23 కిమీ) మార్గాల కోసం మెగా జంక్షన్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎన్‌విఎస్ రెడ్డి సూచించారు.
ఫేజ్-2 పార్ట్ 'ఎ'లోని ఐదు కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరలో కేంద్రానికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అనుమతులు రాగానే పనులు వేగంగా ప్రారంభిస్తామని చెప్పారు. పాతబస్తీలో భూసేకరణ, రోడ్ల విస్తరణ, మెట్రో నిర్మాణం కోసం కూల్చివేత పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి పేర్కొన్నారు. ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు. అయితే ప్రయాణికులు మరింత క్రమశిక్షణ అలవర్చుకుంటే రద్దీ సమస్య గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'MeTimeOnMyMetro' ప్రచారంలో భాగంగా లఘు చిత్రాలను, నృత్యాలను ప్రదర్శించారు. సంక్రాంతి సంబరాలను ప్రతిబింబించేలా రూపొందించిన మెట్రో రైలును ఎన్వీఎస్ రెడ్డి, కేవీబీ రెడ్డి జెండా ఊపి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.