హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు గర్భగుడి తాళాలు పగులగొట్టి, స్వామి విగ్రహానికి అలంకరించి ఉన్న విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.50 లక్షల విలువైన వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వా హకులు తెలిపారు. ఉదయం ఆలయ పూజారులు గర్భ గుడి తలుపులు తెరవడానికి వచ్చిన సమయంలో తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కేపీహెచ్‌బీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఆలయం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దుండగుల కదలికలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఘటనతో స్థానిక భక్తులు, కాలనీవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆలయాల్లో భద్రత మరింత పటిష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.