హైదరాబాద్‌లోని ప్రముఖ ఫుడ్ అవుట్ లెట్లలో ఆహార భద్రత ఉల్లంఘనలు.. కస్టమర్లు జర జాగ్రత్త!
జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఫుడ్ అవుట్ లెట్లపై టాస్క్‌ఫోర్స్ బృందం సమగ్ర తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో ఈ హోటళ్లు వివిధ ఆహార భద్రత ఉల్లంఘనలకు పాల్పడ్డాయని తేలింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 May 2024 7:00 AM ISTహైదరాబాద్‌లోని ప్రముఖ ఫుడ్ అవుట్ లెట్లలో ఆహార భద్రత ఉల్లంఘనలు.. కస్టమర్లు జర జాగ్రత్త!
మే 15, 16 తేదీల్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఫుడ్ అవుట్ లెట్లపై టాస్క్‌ఫోర్స్ బృందం సమగ్ర తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో ఈ హోటళ్లు వివిధ ఆహార భద్రత ఉల్లంఘనలకు పాల్పడ్డాయని తేలింది. గడువు ముగిసినా కూడా ఆహార పదార్థాలను పారవేయడం లేదని.. అంతేకాకుండా అపరిపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపించిందని అధికారులు గుర్తించారు.
36 డౌన్‌టౌన్ బ్రూ పబ్:
36 డౌన్‌టౌన్ బ్రూ పబ్‌లో అధికారులు జరిపిన తనిఖీల్లో చికెన్, డన్ మష్రూమ్, హోయిసిన్ సాస్‌తో సహా గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఈ వస్తువులు పాడైపోయినట్లు అధికారులు కనుగొన్నారు. అంతేకాకుండా ప్రాథమిక పరిశుభ్రత కూడా పబ్ లో పాటించలేదని తెలుస్తోంది.
మకౌ కిచెన్ అండ్ బార్:
మకావు కిచెన్ అండ్ బార్ లో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయని గుర్తించారు. స్నేహ చికెన్, బుల్ డాగ్ సాస్, మాలాస్ ఆరెంజ్ మార్మాలాడ్, టిపరోస్ ఫిష్ సాస్, మయోనైస్, ఫంగస్ సోకిన జీడిపప్పు వంటి గడువు ముగిసిన వస్తువులు కనిపించాయి. వీటిని వెంటనే అక్కడి నుండి తొలగించారు అధికారులు. అంతేకాకుండా ఇన్‌స్పెక్టర్లు స్టోర్ ప్రాంతంలో బతికున్న బొద్దింకలను కూడా కనుగొన్నారు. పరిశుభ్రత గురించి అధికారులు ఆందోళనలను లేవనెత్తారు.
నేచురల్ ఐస్‌క్రీమ్
నేచురల్స్ ఐస్‌క్రీమ్ స్టాల్ లో స్టీల్ కంటైనర్‌లలో ఐస్‌క్రీం, సరైన లేబుల్ లేకుండా రిఫ్రిజిరేటర్‌లో ఐస్ క్రీమ్ కోన్‌లను నిల్వ చేస్తున్నట్లు కనుగొన్నారు. ఫుడ్ హ్యాండ్లర్లకు సంబంధించి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా అందుబాటులో లేవు. ఆహార భద్రత, పరిశుభ్రతను నిర్ధారించడానికి ఇలాంటివి చాలా కీలకం. ఈ అంశాలపై ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒక స్థానిక వ్యక్తి X లో “బయట తినడం చాలా ప్రమాదకరం. కుళ్లిన, గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి." అని తెలిపారు. మరో వ్యక్తి “నిబంధనలు పాటించని వారి లైసెన్సులు రద్దు చేయాలి. భారీ జరిమానాలు విధించాలి. దయచేసి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి.'' అని కోరారు.
నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా:
ఆహార భద్రత మార్గదర్శకాల ప్రకారం, ఆహార భద్రతా నియమాలు, ఆహార భద్రతా అధికారులు జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైతే నిర్వాహకులకి 2 లక్షల రూపాయల జరిమానా విధించనున్నారు.
మరిన్ని తనిఖీలు అవసరం:
ఆహార భద్రత అధికారి ఒకరు మాట్లాడుతూ “ఆహార భద్రత, పరిశుభ్రతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను నిర్ధారించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ ప్రమాణాలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే ఆయా సంస్థలకు జరిమానాలు విధించడమే కాకుండా.. మూసివేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా కఠినమైన శిక్షలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది." అని తెలిపారు.
అన్ని ఫుడ్ అవుట్ లెట్లలో ప్రమాణాలు పాటించాల్సిందే. రాబోయే వారాల్లో మరిన్ని తనిఖీలు కూడా చేస్తాము.