Hyderabad: ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు, వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది

By -  Knakam Karthik
Published on : 24 Nov 2025 8:44 AM IST

Hyderabad, Car Accident, Outer Ring Road, Driver burned alive

Hyderabad: ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు, వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శామీర్‌పేట వద్ద వేగంగా వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ కారు శామీర్‌పేట నుంచి ఘట్‌కేసర్ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో కారులో సాంకేతిక లోపం తలెత్తి షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఏం జరుగుతుందో గ్రహించేలోపే అగ్నికీలలు కారును పూర్తిగా చుట్టుముట్టడంతో డ్రైవర్ బయటకు రాలేకపోయారు.

ఈ ప్రమాదంలో కారుతో పాటు డ్రైవర్ కూడా పూర్తిగా దగ్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతుడి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Next Story