హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రధాన రహదారిపై ఉన్న పరుపులు, సోఫాల తయారీ కేంద్రంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. తయారీ కేంద్రంలో దూది, వస్త్రాలు వంటి మండే స్వభావం గల పదార్థాలు భారీగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. సమాచారం అందుకున్న మొఘల్‌పురా, చంద్రాయణగుట్ట అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
అయితే, ఈ తయారీ యూనిట్‌కు అతి సమీపంలోనే ఎల్‌పీజీ సిలిండర్ల గోడౌన్, రెస్టారెంట్, ఫర్నిచర్ దుకాణం ఉండటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంటల ఉధృతి దృష్ట్యా అగ్నిమాపక సిబ్బంది అదనపు యంత్రాలను పిలిపించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకుని భద్రతా కారణాల దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రక్రియ కొనసాగుతోంది.