అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌లో అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  22 Jun 2023 2:48 PM GMT
CM KCR, Martyrs Memorial, Hyderabad, Telangana

అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున.. హుస్సేన్‌ సాగర్‌ తీరాన తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మించింది. దీన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించడానికి ముందు 12 తుపాకులతో అమరవీరులకు గన్‌ సెల్యూట్‌ చేశారు పోలీసులు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తర్వాత అమరజ్యోతిని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేధావులు, కవులు ఇతరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అమరవీరుల స్మారక చిహ్నాన్ని రూ.178 కోట్ల వ్యయంతో మూడున్నర ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించారు. దీని ఎత్తు 150 అడుగులు. స్మారకాన్ని ప్రమిద, దీపం ఆకృతిలో నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. అమరవీరుల చిహ్నం నమూనాను కళాకారుడు రమణారెడ్డి రూపొందించారు. ఈ అమరవీరుల స్మారక చిహ్నం కేంద్రంలో విశాలమైన సభా మందిరం ఉంటుంది. దీంతో పాటు ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రదర్శన కోసం థియేటర్‌ను కూడా నిర్మించారు. అంతేకాదు.. ఉద్యమ ప్రస్థానాన్ని తెలిపే ఫొటో గ్యాలరీ, ఉద్యమ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. స్మారక కేంద్రంలో పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Next Story