వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు మనోజ్

Manchu Manoj Serious On Saidabad Rape Incident. సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారంపై హీరో మంచు మనోజ్‌ స్పందించాడు.

By M.S.R  Published on  14 Sep 2021 11:50 AM GMT
వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు మనోజ్

సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారంపై హీరో మంచు మనోజ్‌ స్పందించాడు. మంగళవారం బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను మనోజ్‌ పరామర్శించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అన్నాడు. బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని అన్నాడు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలన్నాడు. నిందితుడు దొరకలేదని పోలీసులు అంటున్నారని, దీనిని ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని మనోజ్‌ కోరాడు.

ఛత్తీస్‌గడ్‌లో మూడేళ్ళ క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చిందని తెలిపాడు. అలాగే సైదాబాద్ ఘటనకు కారణమైన నిందితుడిని 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సభ్య సమాజంలో బతుకుతున్న మనమంతా బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. ఈ ఘాతుకానికి కారకుడైన నీచుడిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

ఇలాంటి రాక్షసులకు 24 గంటల్లో ఉరిశిక్ష విధించాలని మంచు మనోజ్ డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణమైన లోకంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాపలేని లోటును తీర్చలేమన్న మనోజ్.. కనీసం ఆ పాప కుటుంబానికైనా అండగా ఉందామని కోరారు. ఈతరం నుంచైనా మగవాడి ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా.. ఇలాంటి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నాడు.


Next Story
Share it