ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వేదింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ఓ పార్టీలో ఓ మహిళను చూసిన ఓ వ్యక్తి.. తాను సీఐడీ అధికారినంటూ సదరు మహిళను లొంగదీసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన రాచకొండ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఓ మహిళకు గత నెల 29న ఓ కొత్త నెంబర్ నుంచి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. అనంతరం వీడియో కాల్స్ రావడం మొదలయ్యాయి. ఓ పార్టీలో బాధితురాలిని చూశానని.. బాగా నచ్చావని.. తనతో గడపాలని.. ఎక్కడికి రావాలో చెప్పమంటూ వేదించడం మొదలుపెట్టాడు. సదరు మహిళ మెసేజ్‌లు చూసినవెంటనే (డబుల్ టిక్స్ రాగానే ) వాటిని డిలీట్ చేసేవాడు. ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నవన్ని అడగ్గా.. తాను సీఐడీ విభాగంలో ఓ ఉన్నతాధికారిని చెప్పాడు.
కొద్ది సేపటి తరువాత యూనిఫాంలో వీడియో కాల్ చేశాడు. దీంతో బాధితురాలు కంగారు పడింది. ఇక లాభం లేదని ఆ నెంబర్‌ను బ్లాక్ చేసింది. అయినప్పటికి వేరు వేరు నెంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు చేస్తూ ఉన్నాడు. తన నెంబర్‌నే బ్లాక్ చేస్తావా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. రోజు రోజుకి అతడి వేదింపులు తీవ్రతరం అవుతుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.