కుండపోతగా కురిసిన వర్షానికి భాగ్యనగరం చిరుగుటాకులా వణికిపోయింది. భారీ వర్షానికి రహదారులన్నీ వాగులను తలపించాయి. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. పనామా చౌరస్తా నుంచి ఎల్బీనగర్ వరద నీరు చేరింది. చింతల్‌కుంటలోని సురభి హోటల్ సమీపంలో కల్వర్టు నాలాలో శుక్రవారం రాత్రి కొట్టుకుపోయిన వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. మహేశ్వరం మండలం మంకాల్ గ్రామానికి చెందిన పి.జగదీష్ (45) వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్ వెలుతుండగా.. బైక్‌తో సహా నాలాలో పడిపోయాడు.
గమనించిన స్థానికులు అతడిని కాపాడేందుకు బైక్‌ను పట్టుకున్నప్పటికి.. అతడు జారి నాలాలో పడిపోయాడు. దీంతో అతడు గల్లంతయ్యాడు అని బావించిన అధికారులు అతడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 2 గంటల అనంతరం అతడు ప్రత్యక్షమవ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై జగదీష్ మాట్లాడుతూ.. ఆటోనగర్ నుంచి కర్మాన్‌ఘాట్‌కు వెలుతుండగా నాలాలో పడిపోయానని అన్నాడు. నీళ్లు ఎక్కువగా ఉండడంతో బైక్ బ్రేక్ కొట్టగా.. స్కిడ్ కావడంతో బైక్‌తో సహా మ్యాన్ హోల్‌లో కొద్దిదూరం కొట్టుకుపోయాను. నీరు ఎక్కువగా ఉండడంతో ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. చేతికి తాడు లాంటిది తగలడంతో పట్టుకుని బయటకు వచ్చా. అయితే.. చేతికి, వీపు భాగంలో గాయాలయ్యాయని తెలిపాడు.