Hyderabad: బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలి వ్యక్తి మృతి
లాలాపేటలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం అర్థరాత్రి బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో 38 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.
By అంజి Published on 1 March 2023 3:05 PM ISTప్రతీకాత్మక చిత్రం
ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. జిమ్ చేస్తూనే, గేమ్ ఆడుతూనే, డ్యాన్స్ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం అర్థరాత్రి బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో 38 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పరమేష్ యాదవ్ అనే ప్రైవేట్ ఉద్యోగి భార్యాపిల్లలతో కలిసి ఆఫీసు నుండి తిరిగి వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడేవాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు స్నేహితులతో కలిసి ఇండోర్ స్టేడియంలో పరమేష్ బ్యాడ్మింటన్ ఆడుతుండగా ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. "అతని స్నేహితులు అతనిని రక్షించడానికి, ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు, కానీ అతను అప్పటికే మరణించాడు'' అని పోలీసులు చెప్పారు. అతను గుండెపోటుతో మరణించాడని వైద్యులు అనుమానిస్తున్నారు. పరమేష్ యాదవ్ మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవు. ఈ ఘటనపై లాలాగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో 60 ఏళ్లు పై బడిన వారికి మాత్రమే గుండెపోటు ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోయింది. కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లోనే ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ ఇలానే గుండె పోటుతో మృతి చెందాడు. నిర్మల్ జిల్లాలో 19 ఏళ్ల కుర్రాడు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. మొన్నటికి మొన్న పెళ్లి కొడుకుకు చందనం రాస్తూ ఒక వ్యక్తి కుప్పకూలాడు. వెంటనే వైద్యం అందినా కూడా ఫలితం లేకుండా పోతోంది. దీంతో సడెన్ హార్ట్ ఎటాక్స్‌పై ఆందోళన మొదలైంది.