హైదరాబాద్ ప్రజలారా జాగ్రత్త..ఈ కల్తీ అల్లంతో ప్రాణాలకే ముప్పు

ప్రాణాంతక రసాయనాలతో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు లాల్లాగూడ పోలీసులు శనివారం రట్టు చేశారు.

By -  Knakam Karthik
Published on : 7 March 2026 2:28 PM IST

Hyderabad News, Public Alert, Food Adulteration, Lalapet, TaskForceRaid, Ginger Garlic Paste

హైదరాబాద్ ప్రజలారా జాగ్రత్త..ఈ కల్తీ అల్లంతో ప్రాణాలకే ముప్పు

హైదరాబాద్: భాగ్యనగర వాసులారా, మీ వంటల్లో వాడే అల్లం-వెల్లుల్లి పేస్ట్ కొనేముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు స్వచ్ఛమైనది అనుకుని వాడుతున్న ఆ పేస్ట్ మీ ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. లాలాపేటలోని జనప్రియ అపార్ట్‌మెంట్స్ సమీపంలో అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, ప్రాణాంతక రసాయనాలతో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు లాల్లాగూడ పోలీసులు శనివారం రట్టు చేశారు.

'ఝాన్సీ అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్' పేరుతో గోడౌన్ నడుపుతున్న నీలా వెంకటేశ్వర్లుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యంత హానికరమైన ఎసిటిక్ యాసిడ్, శాంతన్ గమ్ వంటి కెమికల్స్‌ను అల్లం-వెల్లుల్లి మిశ్రమంలో కలిపి, వాటిని ప్లాస్టిక్ టబ్‌లలో రోజుల తరబడి కుళ్ళబెట్టి, ఆకర్షణీయమైన నకిలీ బ్రాండ్ లేబుల్స్‌తో నగరంలోని కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ మెరుపు దాడుల్లో పోలీసులు ఏకంగా 1,915 కిలోల కల్తీ పేస్ట్‌తో పాటు తయారీకి వాడే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేవలం లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ ముఠాపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 275, 223 కింద కఠిన కేసులు నమోదు చేశారు.

మార్కెట్‌లో తక్కువ ధరకు వస్తుందని నకిలీ బ్రాండ్లను కొని మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిన ముడి పదార్థాలతో తయారయ్యే ఇటువంటి కల్తీ పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు నగర ప్రజలను కోరుతున్నారు.

Next Story