హైదరాబాద్: అందరి దృష్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపైనే నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్‌గా మారగా.. ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని బీఆర్‌ఎస్ అదే స్థాయిలో పావులు కదుపుతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు నువ్వా - నేనా అన్నట్టుగా మారింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతీ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కేవలం నలుగురు ముఖ్య నాయకులతో కలిసి ఆమె ఈ ప్రక్రియను చాలా సాదాసీదాగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 19వ తేదీన భారీ స్థాయిలో ర్యాలీని నిర్వహించి, తన ఎన్నికల ప్రచారంను ఉదృతం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రణాళిక రచించింది. మరోవైపు ఆ పార్టీ కీలక నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.