హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం..హోటళ్లు, వీధి వ్యాపారాలు మూసివేత

హైదరాబాద్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత తీవ్రమవడంతో నగరంలోని స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు అస్తవ్యస్తమయ్యాయి

By -  Knakam Karthik
Published on : 12 March 2026 6:40 AM IST

Hyderabad, LPG Shortage, StreetFood, Hyderabad Hotels, Cylinder Crisis

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం..హోటళ్లు, వీధి వ్యాపారాలు మూసివేత

హైదరాబాద్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత తీవ్రమవడంతో నగరంలోని స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు అస్తవ్యస్తమయ్యాయి. గ్యాస్ సరఫరా లేక అనేకమంది చిరు వ్యాపారులు తమ దుకాణాలను తాత్కాలికంగా మూసివేయగా, మరికొందరు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలు లేదా ఇండక్షన్ స్టవ్‌లపై ఆధారపడుతున్నారు.

ముఖ్యంగా తోపుడు బండ్లు, చిన్న స్టాళ్ల నిర్వాహకులు గ్యాస్ లేకుండా వంట చేయడం సాధ్యం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి చక్కబడుతుందనే ఆశతో కొందరు వేచి చూస్తుండగా, క్లారిటీ లేకపోవడంతో చాలామంది తమ మెనూలను మార్చుకుంటున్నారు. తార్నాకలోని ఒక టీ స్టాల్ యజమాని ఇండక్షన్ స్టవ్‌పై టీ తయారు చేయడం కష్టం కావడంతో, దానిని మానేసి బ్లెండర్ ద్వారా జ్యూస్‌లు, శీతల పానీయాలను విక్రయిస్తున్నారు. అబిడ్స్‌లో చైనీస్ వంటకాలు విక్రయించే వ్యాపారి కూడా ఎలక్ట్రిక్ స్టవ్‌లపై సులభంగా తయారయ్యే మ్యాగీ వంటి పదార్థాలకు మారిపోయారు.

ఈ ప్రభావం కేవలం చిన్న వ్యాపారులకే కాకుండా పెద్ద రెస్టారెంట్ గొలుసులకు కూడా తాకింది. పిస్తా హౌస్ యజమాని మొహమ్మద్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ, ఈ సంక్షోభం సరఫరాదారులు మరియు కార్మికులపై కూడా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరం అంతటా ఉన్న తమ అవుట్‌లెట్లలో బిర్యానీ మినహా గ్యాస్‌పై ఆధారపడే చైనీస్, తందూరి, మొఘలాయ్ వంటి వంటకాలను తయారు చేయడం కష్టతరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బిస్కెట్లు, శాండ్‌విచ్‌లు వంటి సిద్ధంగా ఉండే పదార్థాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇదే క్రమంలో షా ఘౌస్ వంటి ప్రముఖ రెస్టారెంట్లు సైతం వంట కోసం కట్టెలను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Next Story