Hyderabad: రెండు రోజుల పాటు వైన్స్ బంద్
హైదరాబాద్: నగరంలో బోనాల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి.
By అంజి Published on 14 July 2023 12:45 PM ISTHyderabad: రెండు రోజుల పాటు వైన్స్ బంద్
హైదరాబాద్: నగరంలో బోనాల సందడి నెలకొంది. ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లోని నగర వాసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. బోనాల పండుగ సందర్భంగా వైన్ షాపులతో పాటు బార్లు, మద్యం సర్వ్ చేసే క్లబ్బులు, పబ్బులను తెరవకూడదని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలో(ఒక రోజు), సౌత్‌జోన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
జంటనగరాల్లో ఏటా ఆషాడ మాసంలో బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆదేశాలను అతిక్రమించి షాపులు తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా, మద్యం సేవించి గొడవలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు మహంకాళి ఆలయం పరిసరాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిఘా పెట్టారు.