వరద నీటిలో చిక్కుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే కారు
LB Nagar MLA Sudheer Reddy car stuck in flood water.హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు
By తోట వంశీ కుమార్ Published on 15 July 2021 7:34 AM GMTహైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలుచోట్ల నాలాలు పొంగిపొర్లుతుండగా.. చాలా కాలనీలు వరదల్లో చిక్కుకున్నాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఎల్బీనగర ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెలుతుండగా.. హస్తినాపురం సాగర్ ఎన్‌క్లేవ్ కాలనీలో ఆయన వాహనం వరద నీటిలో చిక్కుకుపోయింది. సెక్యురిటీ సిబ్బంది, స్థానికుల సాయంతో సుధీర్ రెడ్డి కారును ముందుకు తోశారు. అతికష్టం మీద వరదల్లో చిక్కుకున్న కారు బయటకు వచ్చింది. వరద నీటిని మళ్లించేందుకు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.
నగరంలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెగకుండా కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. అమీర్ పేట్ , పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అంబర్‌పేట, గోల్నాక సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. అంబర్‌పేట పరిధి పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్‌లో ఇళ్లలోకి మురుగునీరు చేరింది. నీటమునిగిన ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాల్లో జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాగోల్ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, భవానీనగర్‌లో 17.9, హయత్‌నగర్‌లో 17.1 సెంటీమీటర్లు, రామంతాపూర్‌లో 17.1 సెంటీమీటర్లు, హబ్సిగూడలో 16.5, నాగోల్‌లో 15.6, ఎల్బీనగర్‌లో 14.9, లింగోజిగూడలో 14.6, ఉప్పల్ మారుతినగర్‌లో 13.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు మూసారంబాగ్ వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ వైపు నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. నాగోల్ పరిధిలోని అయ్యప్ప నగర్ కాలనీ నీట మునిగింది. మల్లికార్జున నగర్, త్యాగరాజనగర్ కాలనీల్లోకి, సరూర్‌నగర్ చెరువుకట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. కోదండరాంనగర్, సీపల బస్తీ, వీవీనగర్, కమలానగర్‌లో వరద నీరు ప్రవహిస్తున్నది.