కేటీఆర్ అంకుల్.. దయచేసి వీధి కుక్కల నుండి మమ్మల్ని రక్షించండి

KTR Uncle please save us from street dogs Kompally kids residents protest.మేడ్చల్ మల్కాజిగిరిలోని కొంపల్లి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2022 12:59 PM GMT
కేటీఆర్ అంకుల్.. దయచేసి వీధి కుక్కల నుండి మమ్మల్ని రక్షించండి

మేడ్చల్ మల్కాజిగిరిలోని కొంపల్లి మున్సిపాలిటీలోని 12వ వార్డు పరిధిలోని ఎన్‌ఎల్‌సీ కాలనీ వాసులు వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం నిరసన తెలిపారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానిక చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

'కేటీఆర్ మామయ్య, ఎమ్మెల్యే మామయ్య, కమీషనర్ అంకుల్ దయచేసి మమ్మల్ని వీధి కుక్కల బారి నుంచి కాపాడండి' అంటూ పలు ప్లకార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న తెలియ‌జేశారు.


పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. చిన్నపిల్లలను వీధికుక్కలు కరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయని.. పలుమార్లు ఫిర్యాదులు చేశామని తల్లిదండ్రులు తెలిపారు. అయినా పరిష్కారం కాకపోవడం లేద‌ని అన్నారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

28 మార్చి 2021న.. 10 ఏళ్ల ప్రణీత్ రెడ్డి సైకిల్‌పై తన ఇంటికి వెళుతుండగా.. అకస్మాత్తుగా 10 నుంచి 15 కుక్కల గుంపు అతని ఎదురుగా వచ్చింది. దీంతో ప్ర‌ణీత్ చాలా భ‌య‌ప‌డ్డాడు. నెమ్మదిగా రోడ్డు పక్కగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. కుక్క‌ల గుంపు త‌న వైపుగానే వ‌స్తున్నాయి. అకస్మాత్తుగా.. సైకిల్ స్కిడ్ అయి, అతని ముఖానికి తగిలి నేలమీద పడిపోయాడు. అతని ముక్కుకు రాయి గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రణీత్ తల్లిదండ్రులు అతనిని ప్లాస్టిక్ సర్జరీకి తీసుకువెళ్లారు, కానీ అతని వయస్సును దృష్టిలో ఉంచుకుని డాక్టర్ ఆ ఎంపికను తోసిపుచ్చారు. ఓ చిన్న శస్త్రచికిత్సను నిర్వహించారు. 'ఘటన జరిగిన తర్వాత మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. వారు వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించి ఒకట్రెండు కుక్కలను పట్టుకుని వెళ్లిపోయారని 'ప్రణీత్ తండ్రి రామకృష్ణారెడ్డి చెప్పారు.

ప్రణీత కుటుంబం గత రెండేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటోంది. "ఈ ప్రాంతంలో ఎప్పుడూ కనీసం 10-15 వీధికుక్కలు ఉంటాయి. గత కొన్ని నెలలుగా కుక్కల సంఖ్య పెరిగింది" అని రామ కృష్ణ చెప్పారు. వీధి కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

"నేను ప్రతిరోజు ఉదయం సైకిల్‌తో షటిల్ ఆడటానికి వెళ్తాను. ఒక మార్గాన్ని ఎంచుకునే ముందు.. ఆ దారిలో కుక్కలు లేవని నిర్థారించుకున్న త‌రువాత‌నే వెళ‌తాను. నేను ఈ ప్రాంతంలో నివసించేవాడిని కాబట్టి నేను ప్లాన్ చేసుకొని దానిక‌నుగుణంగా మార్గాన్ని ఎంచుకుంటాను. అయితే.. కొత్త వ్య‌క్తి ఈ ప్రాంతాన్ని వ‌స్తే ప‌రిస్థితి ఏంట‌ని రామ కృష్ణ ప్ర‌శ్నించారు.


పదో తరగతి విద్యార్థిని జోషిక మాట్లాడుతూ.. కుక్క‌ల బెడ‌ద కార‌ణంగా రోజూ పాఠశాలకు వెళ్లేటప్పుడు, ట్యూషన్లకు వెళ్లేటప్పుడు భ‌యంతో వెళ్లాల్సి వ‌స్తోంద‌ని చెప్పింది. కుక్క‌లు గుంపులుగా వ‌చ్చి దాడి చేస్తున్నాయ‌ని.. వీటి వ‌ల్ల చిన్నపిల్లలకే కాదు, కాలనీలో నివాసం ఉండే వృద్ధులు.. ఉద‌యం, సాయంత్రం వాకింగ్ కు వెళ్లే వారికి ఇబ్బందిగా ఉంటోంద‌ని తెలిపింది.

"ఈ సమస్య గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 82 కుక్క కాటు కేసులు న‌మోదు అయ్యాయి. గత ఏడు రోజుల్లో దాదాపు 10 కేసులు న‌మోదు కాగా.. అందులో ఎనిమిది మంది చిన్నారులు ప‌ది సంవ‌త్స‌రాల వ‌య‌స్సు పై బ‌డిన చిన్నారులే ఉండ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంద‌ని కొంపల్లిలో స్థానిక బీజేపీ నాయకుడు శివాజీరాజు అన్నారు. ఇప్ప‌టికే చాలా సార్లు అధికారుల‌కు కుక్క‌ల గురించి ఫిర్యాదులు ఇచ్చిన‌ట్లు చెప్పారు. అయితే.. అధికారులు ఫిర్యాదు తీసుకున్న తెల్లారి ఇక్క‌డ‌కు వ‌చ్చి ఒక‌టి లేదా మూడు కుక్కుల‌ను ప‌ట్టుకుని వెలుతారు. అదే రోజు రాత్రి వాటిని మ‌ళ్లీ అదే స్థ‌లంలో వాటిని వ‌దిలి వేస్తున్నార‌న్నారు.

Next Story