హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నాలాలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన న్యూబోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఆనంద్ నగర్‌లో చోటు శనివారం చేసుకుంది. ఆనంద్‌నగర్ కల్వర్టు వద్ద ఉన్న నాలా వద్ద ఉదయం అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఆనంద్ సాయి (7) అనే బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయి గల్లంతు అయ్యాడు.
గమనించిన స్థానికులు గత ఈతగాళ్ల సాయంతో బాలుడి కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. సుమారు రెండు గంటల తరువాత బాలుడి మృతదేహాం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు కళ్లెదుటే తిరిగిన బాలుడు.. రెప్పపాటులోనే నాలాలో పడి మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిదంటూ కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.