9న మహా నిమజ్జనం.. ఏర్పాట్లు పూర్తి
Khairatabad Maha Ganapathi nimajjanam on September 9th.ఈ నెల 9(శుక్రవారం) ని మహా నిమజ్జనం తేదీగా నిర్ణయించారు.
By తోట వంశీ కుమార్ Published on 8 Sept 2022 11:16 AM ISTప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సాన్ సాగర్‌లో నిమజ్జనం చేయవచ్చా లేదా..? అన్న ఉత్కంఠకు తెరపడింది. మట్టి గణపతులతో పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయడానికి అనుమతి లభించింది. ఈ నెల 9(శుక్రవారం) ని మహా నిమజ్జనం తేదీగా నిర్ణయించారు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను జీహెచ్ఎంసీ పూర్తి చేసింది. ఇప్పటికే నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్‌పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9, పీవీ మార్గంలో 8 క్రేన్లను ఏర్పాటు చేశారు. అత్యవసరంగా ఉపయోగించుకోవడానికి మరో 24 క్రేన్లను సాగర్ చుట్టుపక్కలా సిద్దంగా ఉంచారు.
పోలీస్ శాఖ తాత్కాలిక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయగా, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు భక్తులు, సందర్శకులకు తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం మొదలయ్యే సామూహిక నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్ సహా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కొలనులు, బేబిపాండ్ల వద్ద మొత్తం 280 క్రేన్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే గంగ ఒడికి చేరిన ప్రతిమలు, చెత్తా చెదారాలను హెచ్ఎండీఏ అధికారులు ఎప్పటికప్పుడు బయటకు తీస్తుండగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది తరలిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గజ ఈతగాళ్లు, ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దించారు.
శోభయాత్ర మార్గం విడుదల..
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రధాన శోభయాత్ర జరిగే మార్గాన్ని పోలీసులు విడుదల చేశారు. ట్రాఫిక్, ఇతర ఇబ్బందులు లేకుండా ఊరేగింపు మార్గాలు, ఇతర వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గాల్లో శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ఇతర వాహనాలను అనుమతించబోమని కమిషనర్ సీవీ ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి చూడటానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వారి కోసం ఖైరాతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు, బుద్ధ భవన్ వెనుకవైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ గుడి, లోయర్ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, ఐమాక్స్ పక్కన పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.