ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం
ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర మొదలైంది. గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథుడు బయల్దేరాడు.
By అంజి Published on 17 Sept 2024 7:08 AM ISTఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం
హైదరాబాద్: ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర మొదలైంది. గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథుడు బయల్దేరాడు. మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌లో లంబోదరుడిని నిమజ్జనం చేయనున్నారు. తెల్లవారుజామునే తుది పూజలు నిర్వహించిన నిర్వాహకులు క్రేన్ సహాయంతో వినాయకుడిని భారీ టస్కర్‌పైకి ఎక్కించారు. భక్తుల నినాదాలు, సందడి మధ్య ఊరేగింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 దగ్గరికి గణనాథుడు చేరుకోనున్నాడు. అనంతరం నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అటు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాప్‌లు క్లోజ్ అయ్యాయి. రేపు సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నిన్న రాత్రి హుస్సేన్‌సాగర్ చుట్టూ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బంది, క్రేన్ ఆపరేటర్స్‌తో మాట్లాడారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం త్వరగా పూర్తయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.