ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. మధ్యాహ్నం నిమజ్జనం
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం సందడిగా జరుగుతోంది. హుస్సేన్‌సాగర్ సహా మొత్తం 100 చోట్ల అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
By అంజి Published on 28 Sep 2023 2:24 AM GMTఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. మధ్యాహ్నం నిమజ్జనం
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం సందడిగా జరుగుతోంది. హుస్సేన్‌సాగర్ సహా మొత్తం 100 చోట్ల అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య ముందుకు సాగుతున్న గణేషుడు ప్రస్తుతం సెన్సేషన్ థియేటర్ వద్దకు చేరుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్‌సాగర్‌లో బడా గణేష్ నిమజ్జనం జరగనుంది. మరోవైపు బాలాపూర్ గణేష్ ఊరేగింపు కూడా ప్రారంభమైంది.
ఇవాళ ఉదయం 9.30 గంటలకు లడ్డూ వేలంపాట పాడనున్నారు. బాలాపూర్ లడ్డూ వేలాన్ని చాలా మంది ఆసక్తిగా తిలకిస్తారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ - హుస్సేన్‌సాగర్ మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు.
గంగాజమునీ తహజీబ్ స్ఫూర్తిని ప్రపంచానికి చాటేలా గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. దేవుడి కోరిక మేరకు రెండు పండుగలు ఒకే రోజున వచ్చాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నిమజ్జనం కోసం నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఖైరతాబాద్ బడా గణేష్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బడా గణేష్ గురువారం ఉదయం 6 గంటలకు తన యాత్రను ప్రారంభించి, మధ్యాహ్నం 1:30 గంటలకు నిమజ్జనం పూర్తవుతుంది. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జన ప్రక్రియ చట్టానికి లోబడి ఉందని, హైకోర్టు మార్గదర్శకాలకు కట్టుబడి ఉందని, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ప్రజలను కోరారు.