రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన అడ్వకేట్ స్వప్న హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పోలీసుల దర్యాప్తులో అన్న రాజుతో పాటు మరో ముగ్గురు సహకరించినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం ఈ హత్యకు స్వప్న సొంత అన్న రాజే ప్రధాన నిందితుడిగా తేల్చినట్లు పోలీసులు వెల్లడించారు. రాజుతో పాటు హత్యకు సహకరించిన కావళి శివలింగం, వడ్డే వీరేష్, ఎర్రోళ్ల సందీప్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య వెనుక గల కారణాలు, ఇతరుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఒక న్యాయవాదిని అతి దారుణంగా హత్య చేయడంతో న్యాయవాది సంఘాలు ఆగ్రహం చెంది పలుచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించారు.