ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్లాన్‌ను కేసీఆర్.. అందుకే సవరించారు: కె. లక్ష్మణ్

KCR modified Airport Express Metro plan to benefit realtors.. Dr Laxman, హైదరాబాద్: ప్రైవేట్ భూస్వాములు, రియల్టర్లకు లబ్ధి చేకూరేలా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్

By అంజి  Published on  22 Dec 2022 9:44 AM GMT
ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్లాన్‌ను కేసీఆర్.. అందుకే సవరించారు: కె. లక్ష్మణ్

హైదరాబాద్: ప్రైవేట్ భూస్వాములు, రియల్టర్లకు లబ్ధి చేకూరేలా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మార్చారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ప్రభుత్వ భూములను పెద్దఎత్తున విక్రయించిందని, పేదలకు కేటాయించిన భూములను బలవంతంగా సేకరిస్తున్నారని ఆరోపించారు. ప్రయివేటు భూముల ధరలు పెంచేందుకే కేసీఆర్ ఎయిర్ పోర్ట్ మెట్రో లైన్ రూట్ మార్చారన్నారు.

సామాన్యుల ప్రయోజనాలను విస్మరిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతోందన్నారు. ఏఐఎంఐఎంకు మేలు చేసేందుకే ప్రభుత్వం మెట్రో లైన్‌ను 16 కిలోమీటర్ల నుంచి 32 కిలోమీటర్లకు పొడిగించిందని ఆరోపించారు. ప్రాజెక్టుకు ప్రభుత్వం 100 శాతం నిధులు మంజూరు చేస్తుందన్న కేసీఆర్ మాట విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని డాక్టర్‌. కె. లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భూములను రక్షించాలని ఎంపీ లక్ష్మణ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఇక ఇటీవలే హైదరాబాద్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ నిర్మించతలపెట్టిన మెట్రో మార్గానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపపన చేశారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ సమీపంలోని మైండ్ స్పేస్ వద్ద దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టు 31 కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నారు. దీని కోసం మొత్తం రూ.6,250 కోట్ల ఖర్చు చేయనున్నారు.

Next Story
Share it