అమిత్‌షాతో జూ.ఎన్టీఆర్‌ భేటీ.. ఏం చర్చించుకున్నారంటే?

Junior NTR met with Amit Shah. నందమూరి హీరో జూనియర్‌ ఎన్టీఆర్ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

By అంజి  Published on  22 Aug 2022 6:56 AM IST
అమిత్‌షాతో జూ.ఎన్టీఆర్‌ భేటీ.. ఏం చర్చించుకున్నారంటే?

నందమూరి హీరో జూనియర్‌ ఎన్టీఆర్ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ ముగిసిన తర్వాత హైదారాబాద్‌ చేరుకున్న అమిత్‌షా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్‌ హోటల్‌కు రాత్రి 10.26కు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడకు జూ.ఎన్టీఆర్ రాగా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎన్టీఆర్‌ను అమిత్‌ షా దగ్గరికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌ను అమిత్‌ షా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించారు. ఆ తర్వాత అమిత్‌షాకు ఎన్టీఆర్‌ శాలువా కప్పి సత్కరించారు. మొత్తం 45 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. ఇందులో 20 నిమిషాల పాటు వీరు ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతం అమిత్‌ షా, ఎన్టీఆర్‌, ఇతర బీజేపీ నాయకులు కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌లు కలిసి భోజనం చేశారు.

ఎన్టీఆర్‌తో సమావేశం సందర్భంగా అమిత్‌షా సీ.ఎన్టీఆర్‌ గురించి చర్చించినట్లు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. సీ.ఎన్టీఆర్‌ నటించిన దానవీరశూర కర్ణ, విశ్వామిత్ర సినిమాలు తాను చూశానని చెప్పారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో అధికారులు బాగా పని చేసేవారని అన్నారు. జూ.ఎన్టీఆర్‌తో సమావేశం ముగిసిన తర్వాత.. అమిత్‌ షా ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారకరత్నం ఎన్టీఆర్‌ను ఇవాళ హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించిందని బీజేపీ అగ్రనేత అమిత్‌షా పేర్కొన్నారు.




Next Story