హైదరాబాద్‌లో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా?.. అయితే మీకో గుడ్‌న్యూస్
కొత్తగా భవనం కట్టుకునేవారికి హైదరాబాద్ జలమండలి గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 17 Nov 2024 6:49 AM ISTహైదరాబాద్‌లో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా?.. అయితే మీకో గుడ్‌న్యూస్
హైదరాబాద్: కొత్తగా భవనం కట్టుకునేవారికి హైదరాబాద్ జలమండలి గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్తగా భవనాలు నిర్మించుకునే వారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతుల కోసం సమర్పించాల్సిన వాటర్ ఫీజబిలిటీ సర్టిఫికెట్‌ను జారీ చేసే ప్రక్రియను జలమండలి మరింత సులభతరం చేసింది. నగర పరిధిలోని కొత్త భవనం నిర్మించాలంటే జీహెచ్ఎంసీ అనుమతి తప్పనిసరి. అనుమతి కోసం భవన యజమానులు విద్యుత్ ఫీజబిలిటీ, వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఈ సర్టిఫికెట్స్ పొందాలంటే జలమండలి సర్కిల్ కార్యాలయాల్లో సీజీఎం జారీ చేసేవారు. పలు కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరిగేది. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ధ్రువపత్రాల జారీని జలమండలి కేంద్ర కార్యాలయం నుంచే చేపట్టేలా మార్పులు చేశారు.
ఇందుకోసం జలమండలి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కస్టమర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ధ్రువపత్రాలు జారీ చేస్తుంది. ఈ ధ్రువపత్రాల కోసం కస్టమర్లు ముందుగా తమ దగ్గర్లోని సీజీఎంలకు దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. వారు 6 రోజుల పాటు వాటిని పరిశీలించి.. ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్న కమిటీకి పంపిస్తారు. సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులు 30 రోజుల్లోగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిర్దేశిత 5 రోజుల్లో సీజీఎం ధ్రువపత్రాల్ని జారీ చేస్తారు. దీని వల్ల భవనాలు నిర్మించుకునే వాళ్లకు పని, ధ్రుపత్రాల విషయంలో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ఈ కమిటీ ద్వారా ఈ నెలలో ఇప్పటికే 19 వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రాల్ని జారీ చేశారు.