సోషల్ మీడియా వాడొద్దన్న తల్లి.. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకిన యువతి
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.
By అంజి Published on 2 Aug 2023 6:51 AM IST
హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. అయితే లేక్ పోలీసులు ఆమెను కాపాడారు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. సోషల్ మీడియా ఎక్కువగా వాడొద్దని తల్లి మందలించడంతోనే విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మాదాపూర్ పోలీసులు తెలిపారు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బాలిక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తన మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుండడం, ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేయడం గమనించిన తల్లి.. ఆమెను హెచ్చరించింది.
ఈ క్రమంలోనే నిన్న ఉదయం 07:30 గంటలకు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక.. కాలేజీకి వెళ్లలేదని తల్లికి తెలియడంతో తనకు తెలిసిన చోట్ల గాలించింది. చివరకు తల్లి తన బిడ్డ కోసం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫోన్‌ను ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్టర్-కేపీహెచ్‌బీ, బాలిక దుర్గం చెరువు వద్ద ఉందని వెంటనే తెలుసుకున్నారు. వెంటనే కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతి, ఎస్‌హెచ్‌వో-మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ ఆదేశాల మేరకు లేక్ పోలీస్ సిబ్బంది, ఐటీ మొబైల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో కేబుల్ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి బాలిక దూకడాన్ని గమనించారు.
పోలీసులు వెంటనే అప్రమత్తమై బోటింగ్ సిబ్బంది సాయంతో చెరువులోకి దూకిన బాలికను రక్షించారు. ఆమెను చికిత్స కోసం మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది. సకాలంలో స్పందించిన లేక్ పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీశైలం, నవీన్, ఐటీ మొబైల్ స్టాఫ్ రెహ్మత్ అలీ, కృష్ణయ్యను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. తమ కూతురును కాపాడినందుకు బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.