హైదరాబాద్: బంజారాహిల్స్ పరిధిలోని నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న భారీ ముఠాను టాస్క్‌ఫోర్స్ మరియు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శంషాబాద్ కేంద్రంగా 'మెట్రో గ్యాస్ ఏజెన్సీ' నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు మొహమ్మద్ అమీర్, ఒక స్మశాన వాటికను అక్రమ డీ డెలివరీ పాయింట్‌గా మార్చుకుని ఈ దందాను నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది.
ఈ దాడుల్లో ఏజెన్సీ నిర్వాహకుడితో పాటు డెలివరీ బాయ్స్, వాహన డ్రైవర్లు మరియు నిల్వకు స్థలాన్ని అద్దెకు ఇచ్చిన వ్యక్తి సహా మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు ₹21.88 లక్షల విలువైన 414 గ్యాస్ సిలిండర్లను, రవాణాకు ఉపయోగిస్తున్న 10 వాహనాలను (DCMలు, ఆటోలు, బొలెరో) స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లను డంప్ చేసి, అవసరమున్న వారికి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్న ఈ ముఠా ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు.