పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం: ఈటల రాజేందర్‌

ఉప్పల్‌ నియోజకవర్గంలోని రామాంతపూర్‌లో మూసీ పరివాహక ప్రాంతాన్ని బీజేపీ ప్రతినిధి బృందం పరిశీలించింది.

By అంజి  Published on  23 Oct 2024 12:50 PM IST
Hyderabad, Etala Rajender, Musi, Uppal, Ramanthapur

పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం: ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌: ఉప్పల్‌ నియోజకవర్గంలోని రామాంతపూర్‌లో మూసీ పరివాహక ప్రాంతాన్ని బీజేపీ ప్రతినిధి బృందం పరిశీలించింది. కేసీఆర్‌ నగర్‌, బాలకృష్ణ నగర్‌, సాయికృష్ణ నగర్‌ ఏరియాల్లో ఎంపీ ఈటల రాజేందర్‌ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, శిల్పారెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ పర్యటించారు. బాలకృష్ణ నగర్‌ ప్రజల సమస్యలను బీజేపీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. తమ ఇళ్లను కూల్చివేస్తారనే ప్రచారం జరుగుతోందని.. తమను ఆదుకోవాలని ఈటలను స్థానికులు కోరారు. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నామని, ఇక్కడి నుంచి పొమ్మంటే ఎక్కడికి పోవాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈనెల 25న ఇందిరా పార్క్ వద్ద మూసీ బాధిత కుటుంబాల కొరకు చేపట్టే ధర్నాకు తరలిరావాలని మూసి బాధిత కుటుంబాలకు ఈటల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌పై విసిగిపోయి, కాంగ్రెస్ ఆశ చూపే హామీలు విని కాంగ్రెస్ ని పట్టం కట్టి గెలిపించారని అన్నారు. కాంగ్రెస్‌ని గెలిపించిన పాపానికి గత రెండు మూడు నెలలుగా చెరువుల వద్ద, మూసి పరివాహక ప్రాంతం వద్ద గత ముప్పై ఏళ్లకు పైగా ఇంటి నిర్మాణాలు చేపట్టి నివసిస్తున్న కుటుంబాలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నారు.

శనివారం, ఆదివారం వస్తే చాలు ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలేకుండా భయబ్రాంతులకు గురిచేస్తోందని ఈటల ఫైర్‌ అయ్యారు. పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాన్య ప్రజానీకం పైన దౌర్జన్యం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ ఈ పేదలకు అండగా ఉంటుందన్నారు. పార్టీ పరంగా ఇవాళ, రేపు మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను ఇళ్లను సందర్శించి, వారి మాటలను ప్రతిబింబించే విధంగా 25న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తామన్నారు.

Next Story