Hyderabad: హైడ్రా ఆపరేషన్.. 100 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అథారిటీ (HYDRAA) టాస్క్ ఫోర్స్ సెప్టెంబర్ 20, శనివారం గాజులరామారంలో..
By - అంజి |
Hyderabad: హైడ్రా ఆపరేషన్.. 100 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అథారిటీ (HYDRAA) టాస్క్ ఫోర్స్ సెప్టెంబర్ 20, శనివారం గాజులరామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టింది. ఆక్రమణకు గురైన 100 ఎకరాల ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది. ఆక్రమణదారులు 60–70 చదరపు గజాల ప్లాట్లలో ఇళ్ళు నిర్మించుకుని, వాటిని ఒక్కొక్కటి దాదాపు రూ.10 లక్షలకు అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే కొందరు దీనిపై హైడ్రాకు ఫిర్యాదుల చేశారు.
హైడ్రా జోక్యం చేసుకుని దాదాపు రూ. 4,500 కోట్ల విలువైన భూములు భూ కబ్జాదారుల నియంత్రణలో ఉన్నాయని కనుగొన్నారు. శనివారం, సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేశారు. కూల్చివేత సమయంలో, స్థానిక నివాసితులు డబ్బు చెల్లించి ఇళ్ళు కొనుగోలు చేశారని పేర్కొంటూ నిరసనలు చేపట్టారు. కొనుగోలుదారులను శిక్షించడం కంటే, తమకు ప్లాట్లు అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గాజులరామారంలో 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
హైడ్రా అధికారుల ప్రకారం, గాజులరామారం ప్రాంతంలో మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అందులో 100 ఎకరాలు ఇటీవలి సంవత్సరాలలో ఆక్రమణకు గురయ్యాయి. కూల్చివేత తర్వాత, హైడ్రా మొత్తం 300 ఎకరాలను ఫెన్సింగ్‌తో రక్షించాలని యోచిస్తోంది, ఎందుకంటే ఇప్పుడు ఆ భూమి విలువ రూ. 15,000 కోట్లకు పైగా ఉంటుంది. హైదరాబాద్ ఐటీ కారిడార్ నుండి దాదాపు 10 కి.మీ దూరంలో ఉన్న గాజులరామారంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.
ఫైనాన్స్ కార్పొరేషన్, TGIIC, HMDA భూమి ఆక్రమణకు గురైంది.
ఈ భూమి మొదట రాష్ట్ర ఆర్థిక సంస్థ, TGIIC, HMDA, హౌసింగ్ బోర్డు వంటి విభాగాలకు చెందినది. వీటికి దశాబ్దాల క్రితం ప్లాట్లు కేటాయించబడ్డాయి. అయితే, ఆ విభాగాలు ప్రాజెక్టులను చేపట్టకపోవడంతో, గత మూడు, నాలుగు సంవత్సరాలుగా భూ కబ్జాదారులు ఆ స్థలాన్ని క్రమపద్ధతిలో ఆక్రమించడం ప్రారంభించారు.