మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మందిని సురక్షితంగా కాపాడిన హైడ్రా DRF

హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదకర ఘటనలో హైడ్రా (HYDRA) డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరోసారి అపదమిత్రగా నిలిచింది.

By -  Knakam Karthik
Published on : 26 Jan 2026 10:02 AM IST

Hyderabad News, Miralam lake, Hydra DRF, 9 People Rescued

మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మందిని సురక్షితంగా కాపాడిన హైడ్రా DRF

హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదకర ఘటనలో హైడ్రా (HYDRA) డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరోసారి అపదమిత్రగా నిలిచింది. మిరాలం చెరువులో బోటు చెడిపోవడంతో మధ్యలోనే చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులు, ఇంజనీర్లను హైడ్రా DRF బృందం సాహ సోపేతంగా రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. పాతబస్తీ జూ పార్కు సమీపంలోని మిరాలం చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా, చెరువుపై నిర్మించనున్న వంతెనకు సంబంధించి సాయిల్ టెస్ట్ నిర్వహించేందుకు ఆదివారం ఉదయం కార్మికులు, ఇంజనీర్లు బోటు ద్వారా చెరువులోకి వెళ్లారు.

పనులు ముగిసిన అనం తరం సాయంత్రం తిరిగి వస్తుండగా, అకస్మాత్తుగా బోటు ఇంజన్ పనిచేయ కపోవడంతో వారు చెరువు మధ్యలోనే చిక్కుకుపో యారు. బోటు మరమ్మత్తుల కోసం మెకానిక్‌ను సంప్రదించగా, ఒడ్డుకు వస్తేనే ఇంజన్‌ను బాగుచేయగల మని చెప్పడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. బోటును నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, చెరువులో విస్తారంగా పెరిగిన గుర్రపు డెక్క కారణంగా అది ముందుకు కదలలేదు. చెరువులో మొసళ్లున్నాయనే భయంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అనంతరం వారు డయల్–100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా DRF కంట్రోల్ రూమ్ స్పందించింది. హైడ్రా ఎస్‌ఎఫ్‌వో జమీల్, రెస్క్యూ టీమ్ ఇన్‌చార్జి స్వామి బాధితులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. చీకటి, దట్టమైన గుర్రపు డెక్క, ప్రమాదకర పరిస్థితుల మధ్య హైడ్రా DRF బృందం చెరువులోకి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. సెల్‌ఫోన్ లైట్ల సహాయంతో బాధితుల ఆచూకీ తెలుసుకొని, టార్చ్ లైట్లతో అతి కష్టంపై అక్కడికి చేరుకున్నారు. ముందుగా వెళ్లి నలుగురిని....ఆ తర్వాత రెండోసారి వెళ్లి మిగిలిన ఐదుగురిని కూడా సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి వేళ ప్రాణాపాయ పరిస్థితుల్లో జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌తో తొమ్మిది మంది ప్రాణాలు దక్కాయి. తమను కాపాడిన హైడ్రా DRF సిబ్బందికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ ధైర్యంగా వ్యవహరించిన హైడ్రా బృందాల పనితీరును స్థానికులు అభినందించారు.

Next Story