ఇంకా మార్చి కూడా రానేలేదు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడి ప్రతాపం మొదలు అవుతోంది. దీంతో బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. హైదరాబాద్ నగరంలో గత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఫిబ్రవరి నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నెలలో మిగిలిన నాలుగు రోజుల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం-హైదరాబాద్ (IMD-H) తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇప్పటికే 35.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇదే అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
గతేడాది ఫిబ్రవరి 23న హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. 2020, 21లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరి నెలలో అత్యధికంగా 34.7 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత ఎక్కువగా మంచి నీరు తాగాలని సూచిస్తున్నారు.