HYD: జూ పార్క్ ఆన్‌లైన్ టికెట్ల కోసం మొబైల్ యాప్‌

Hyderabad Zoo Park gets website, mobile app for online ticketing. హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్.. సందర్శకుల కోసం సరికొత్త నిర్ణయం

By అంజి  Published on  13 Feb 2023 2:05 PM IST
HYD: జూ పార్క్ ఆన్‌లైన్ టికెట్ల కోసం మొబైల్ యాప్‌

హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్.. సందర్శకుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పార్క్‌ సందర్శన కోసం వచ్చే పౌరులకు టికెటింగ్‌ విషయంలో ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్‌ సేవలను తీసుకొచ్చింది. ఆన్‌లైన్ టికెట్ల కోసం మొబైల్ యాప్‌తో పాటు కొత్త వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించింది. తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అల్లోల యాప్‌, వెబ్‌సైట్‌ను లాంచ్‌ చేశారు. కొత్త వెబ్‌సైట్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సిజిజి) అభివృద్ధి చేసింది. కొత్త చేరికతో పౌరులు అవాంతరాలు లేని బుకింగ్ సేవను పొందుతారు.

కోవిడ్‌-19 కారణంగా కాంటాక్ట్‌లెస్ టికెటింగ్‌ను సులభతరం చేయడానికి యాప్ యొక్క మొదటి వెర్షన్ 2020లో ప్రారంభించబడింది. పార్కులోని ప్రధాన ఆకర్షణ, బ్యాటరీ వాహనాలు కూడా ఈ కొత్త అప్లికేషన్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇకపై జూపార్క్‌ వచ్చి లైన్‌లో నిల్చునే అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే బుకింగ్ చేసుకోవచ్చన్నమాట. యాప్‌, వెబ్‌సైట్‌ లాంచ్‌ కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, అటవీ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


హైదరాబాద్‌లో చూడదగిన పర్యాటక ప్రదేశాల్లో నెహ్రూ జూపార్క్‌ ఒకటి. దేశంలోనే అతిపెద్ద జూపార్క్‌ల్లో ఇది ఒకటి. నెహ్రూ జూ పార్క్‌కు 1959లో బీజం పడింది. అక్టోబరు 12, 1963 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 380 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న.. ఈ జంతు ప్రదర్శనశాలలో దాదాపు 1,500 జాతుల జంతువులు, పక్షులు ఆవాసం ఉంటున్నాయి.

Next Story