Hyderabad: ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బు పోగొట్టుకున్న యువతి.. నకిలీ దోపిడీ డ్రామా ఆడి..
హైదరాబాద్: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఓ బాలిక హై డ్రామా ప్లే చేసింది. తన డ్రామాతో అందరినీ పిచ్చోళ్లను చేసింది.
By అంజి Published on 12 April 2024 6:49 AM GMTHyderabad: ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బు పోగొట్టుకున్న యువతి.. నకిలీ దోపిడీ డ్రామా ఆడి..
హైదరాబాద్: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఓ బాలిక హై డ్రామా ప్లే చేసింది. తన డ్రామాతో అందరినీ పిచ్చోళ్లను చేసింది. ఈ మహానటి నటనకు స్థానికులతో పాటు తల్లిదండ్రులు సైతం నిజమని నమ్మారు. కానీ పోలీసులు ఇచ్చిన ట్విస్ట్‌తో యువతి బండారం బయట పడింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి దొంగలు చోరబడి అందిన కాడికి దోచుకు పోయారంటూ ఫిర్యాదు రావడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు కొనసాగించారు.
తాను వాష్ రూమ్‌లోకి వెళ్ళిన సమయంలో ముఖానికి మాస్క్ ధరించి కొందరు దుండగులు ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా పడేసి అలమరలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారని, తాను వాష్ రూమ్‌లోకి వెళ్లి వచ్చేసరికి దుండగులు ఇంటి నుండి బయటకు పరుగులు తీసారని, వారిని పట్టుకునేందుకు తాను ప్రయత్నం చేయగా తనను దుండగులు గోడకు నెట్టేసి అక్కడి నుండి పారిపోయారని బాలిక పోలీసులకు వెల్లడించింది. దీంతో పోలీసులు చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు కొనసాగించారు.
ఎంతైనా పోలీసులు కదా.. తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో అసలు నిజం యువతి బయటికి కక్కింది. యువతి ఆన్‌లైన్ గేమ్ లకు అలవాటు పడి 25 వేల రూపాయలను పోగొట్టుకుంది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు కోప్పడతారని పక్కా స్కెచ్ వేసింది. అనుకున్న పథకం ప్రకారం ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో అదే అదనుగా భావించిన సదరు యువతి ఇంట్లోకి దొంగలు చొరబడి నగదు, బంగారం కొట్టేసారని పైగా మంకీ క్యాప్ లు ధరించి మరీ చోరీకి వచ్చారని ఒక చక్కటి కథ అల్లి స్థానికులను, మీడియాను నమ్మించింది. పోలీసులను సైతం బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో.... దొంగతనం జరగలేదు బాబోయ్ తానే ఈ నాటక మంతా ఆడానని పోలీసుల ఎదుట ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు.