హైదరాబాద్: మార్ఫింగ్ చేసిన వీడియోలను ఉపయోగించి బ్లాక్‌మెయిల్, దోపిడీకి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు.. 26 ఏళ్ల హైదరాబాద్ మహిళ తాజా బాధితురాలిగా మారింది. గౌలిగూడకు చెందిన ఆ యువతి నుండి సైబర్ నేరగాళ్లు ఆమె ముఖంతో కూడిన మార్ఫింగ్ చేసిన అశ్లీల కంటెంట్‌ను పంపి రూ.1.45 లక్షలు దోపిడీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 10న ఆ యువతి రూ. 7,000 రుణం చెల్లించలేదని తప్పుడు ఆరోపణతో వాట్సాప్ సందేశం రావడంతో ఇదంతా ప్రారంభమైంది. సదరు హైదరాబాద్ యువతి ఎలాంటి రుణం తీసుకోలేదని నిరాకరించినప్పటికీ, ఆమె ఆ మొత్తాన్ని చెల్లించే వరకు మోసగాళ్ళు ఆమెను వేధిస్తూ వచ్చారు.
చెల్లింపు తర్వాత కూడా వేధింపులు కొనసాగాయి. ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి నేరస్థులు ఆమెకు మార్ఫింగ్ చేసిన వీడియోలను పంపారు. వాటిని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తామని బెదిరించారు. అవమానం, సామాజిక పరిణామాలకు భయపడి, బాధితురాలు వారి డిమాండ్లకు కట్టుబడి మొత్తం రూ.1.45 లక్షలను బదిలీ చేసింది. అయితన యువతిపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
పదే పదే ఫోన్ కాల్స్ ద్వారా వేధింపులు ఎదుర్కొన్న తర్వాత, ఆ యువతి తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించింది. వారి మద్దతుతో, ఆమె అధికారికంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బాధ్యులైన వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయడానికి దర్యాప్తు చేస్తున్నారు.