గుండు చేయించాడు.. ఉపాధి కోల్పోయాడు.. ఇదో వింత ఘటన
Hyderabad Uber driver lost job after tonsure his head.ఉబర్ యాప్‌లో లాగిన్ అయ్యేందుకు సెల్ఫీతో ప్రయత్నించాడు. తలపై జుట్టు లేకపోవడంతో యాప్ అతడిని గుర్తించలేదు
By తోట వంశీ కుమార్ Published on 2 April 2021 9:50 AM GMT
అంతా మంచే జరగాలని దేవుడికి తలనీలాలు సమర్పించుకున్నాడు. అయితే.. అతడు చేసిన ఆ పని వల్ల ఉపాధి కోల్పోయాడు. అరే గుండు చేయించుకుంటే ఉపాధి ఎలా పోయిందని అంటారా..? అయితే.. ఓ సారి ఇది చదవండి. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఏడాదిన్నర కాలంగా ఉబర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఇప్పటివరకు 1428 ట్రిప్‌లతో 4.67 స్టార్ రేటింగ్‌తో ఉన్నాడు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లాడు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం తలనీలాలు సమర్పించుకున్నాడు.
అనంతరం ఎప్పటిలాగే ఫిబ్రవరి 27న ఉబర్ యాప్‌లో లాగిన్ అయ్యేందుకు సెల్ఫీతో ప్రయత్నించాడు. అయితే.. అది సాధ్యపడలేదు. తలపై జుట్టు లేకపోవడంతో యాప్ అతడిని గుర్తించలేదు. ఇలా నాలుగైదు సార్లు ప్రయత్నించడంతో అతడి ఖాతా బ్లాక్ అయ్యింది. తెల్లారి ఉబర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే.. తన కారుకు వేరే డ్రైవర్‌ను పెట్టుకోవాలని సూచించారు. అయితే.. అంత భరించసోమత్త లేదని శ్రీకాంత్ వాపోయాడు. ఒక నెలరోజుల తరువాత మళ్లీ ఉబర్ కార్యాలయానికి వెళ్లగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు ఓ ఈ-మెయిల్ ఐడీ ఇచ్చారు. అయినప్పటికి ఇంకా ఆవ్యవహారం నడుస్తూనే ఉందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
యాప్ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్ వర్కర్ల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్ సలాయుద్దీన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. డ్రైవింగే శ్రీకాంత్ కు జీవనాధారమని, అతడు కారు ఈఎంఐ కూడా చెల్లించాల్సి ఉందన్నారు. లాక్‌డౌన్ సమయంలో డ్రైవర్లంతా ఖాళీగానే తిరగాల్సి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో ఉబర్ అల్గారిథమ్ డ్రైవర్ల ముఖాల్ని గుర్తించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. శ్రీకాంత్‌కు ఎదురైన ఇలాంటి సమస్య మరో డ్రైవర్‌కు రాకూడదని, ఉబర్ సంస్థ ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.